ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై తిరుమలలో అక్షరాభ్యాసం కి వీలుగా 'అక్షర గోవిందం' కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:24 PM

తెలంగాణ రాష్ట్రములోని బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. 'అక్షర గోవిందం' పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండలవాడి తల్లి వకుళమాత ఆశీస్సులతో అక్షర శ్రీకారం చుట్టించాలని భావించే భక్తుల కోరిక నెరవేరనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఈ 'అక్షర గోవిందం' ప్రాజెక్టును రూపొందించింది. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే, వకుళమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.ఈ నూతన మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత, పిల్లలకు 'అక్షర గోవిందం' పేరుతో ఏడు రకాల వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్‌ను అందజేస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు-సరస్వతి-శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటం, కంకణాలు, పటికబెల్లం ప్రసాదం ఉంటాయి.తొలుత ఈ కార్యక్రమాన్ని 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా? లేక నామమాత్రపు రుసుము వసూలు చేయాలా? అనే విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa