ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరాలకు అనుగుణంగా గ్యాస్ కోసం....టీటీటీడి ముందస్తు చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 06:15 PM

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇంధన సంక్షోభం ప్రభావం తిరుమలపై పడకుండా.. తిరుమలలోని ఆలయ వంటశాలలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీటీడీ తన వద్ద ఎల్పీజీ గ్యాస్ నిల్వలను పెంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం 80 వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలాగే శ్రీవారి భక్తులు నిత్యాన్నదానం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. దీనికి తోడు రోజూ 4 లక్షల లడ్డూలను టీటీడీ భక్తుల కోసం సిద్ధం చేస్తుంది. ఆలయ వంటశాలల నిర్వహణ కోసం తిరుమలలో రోజుకు 6 టన్నుల వరకూ ఎల్పీజీ గ్యాస్ అవసరమవుతుందని అంచనా.


తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలోని వంటశాలల కోసం రోజుకు 2 టన్నుల ఎల్పీజీ గ్యాస్ అవసరం అవుతుంది. ఈ కిచెన్లలోనే భక్తులకు అవసరమైన అన్నప్రసాదం తయారుచేస్తారు. అలాగే తిరుమలలో రోజూ మూడున్నర లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారీ చేస్తారు. ఈ లడ్డూల తయారీ కోసం రోజూ 4 టన్నుల గ్యాస్ అవసరం అవుతుంది. ఈ రకంగా తిరుమలలో రోజుకు 6 టన్నుల ఎల్పీజీ గ్యాస్ అవసరం అవుతుందని అధికారులు చెప్తున్నారు.


పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిన కారణంగా టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలకు నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేయాలని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులను కోరారు. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టీటీడీకి హామీ ఇచ్చింది.


మరోవైపు టీటీడీ ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ నిల్వలను బఫర్ స్టాక్‌గా ఉంచినట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీకి తిరుమలలో ఐదు ఎల్పీజీ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకుల ద్వారా 38 టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వ చేయవచ్చు. ఈ నిల్వలతో వారం రోజుల పాటు టీటీడీ తన కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చు.


వీటికి అదనంగా చెన్నై నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకులను కూడా తిరుమలకు రప్పిస్తున్నట్లు ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వీటికి తోడుగా సహాయక వంటశాలలు, ఉద్యోగుల క్యాంటీన్ మొదలైనచోట్ల ఎల్పీజీ గ్యాస్‌ను నిల్వ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa