ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘చైనాను అడుక్కునే స్థాయికి దిగజారిపోయారు’.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 07:41 PM

పశ్చిమాసియాలో ఇరాన్ , ఇజ్రాయెల్- అమెరికాల మధ్య ఆయుధాలతోనే కాదు.. మాటల యుద్ధం కూడా జరుగుతోంది. హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ అడ్డుకోవడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయిల్ ట్యాంకర్లకు రక్షణగా యుద్ధ నౌకలను పంపాలని జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తనకు బద్ద శత్రువైన చైనాను కూడా ట్రంప్ అడుక్కుంటున్నారని ఎగతాళి చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.


‘‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్మీగా చెప్పుకునే అమెరికా.. ఇప్పుడు తన ఆయిల్ ట్యాంకర్ నౌకల రక్షణ కోసం ఇతర దేశాలను యాచిస్తోంది.. చివరకు తన చిరకాల శత్రువైన చైనాను కూడా బతిమిలాడుకునే స్థాయికి ట్రంప్ దిగజారిపోయారు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో ఎద్దేవా చేసింది. పశ్చిమాసియాలో తన పట్టు కోల్పోతున్న అమెరికా.. మిత్రదేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందని ఇరాన్ మీడియా వ్యాఖ్యానించింది. హర్మూజ్‌ తమ అధీనంలోనే ఉంటుందని, ఇతర దేశాల నౌకల గస్తీకి తాము అంగీకరించబోమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ స్పష్టం చేసింది.


ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిని దాదాపు ఇరాన్ నియంత్రించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఈ జల సంధి ద్వారా పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకునే దేశాలకు సొంతంగా రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. కానీ, ఈ విజ్ఞప్తిపై చైనా, జపాన్ సహా ఇతర దేశాలు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఒకవేళ పరాయి దేశాల యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలోకి వస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరోవైపు, రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అమెరికా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఒకప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని భారత్‌ సహా అనేక దేశాలపై ఒత్తిడి తెచ్చిన అమెరికా... ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చీ ఎగతాళి చేశారు.


యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో తాము గెలిచేశామని అమెరికా-ఇజ్రాయెల్‌ సంబరపడిపోయాయి. కానీ, ఆ సంతోషం కొద్ది కాలమేనని ఇరాన్ ప్రతీకార చర్యలతో తేలిపోయింది. రెండు వారాలు దాటినా ఇరాన్ ప్రతిఘటన ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa