పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై భద్రతా ఆందోళనలు, ఆంక్షలు పెరగడంతో గ్లోబల్ షిప్పింగ్ రంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ సంస్థల్లో ఒకటైన MSC Mediterranean Shipping Company తన వ్యాపార నమూనాలో కీలక మార్పులు చేసింది.ప్రమాదకరమైన సముద్ర మార్గాలను తప్పించేందుకు సౌదీ అరేబియా గుండా భూమార్గాల ద్వారా సరుకు రవాణా చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త లాజిస్టిక్స్ సేవ మే 10 నుంచి బెల్జియంలోని ఆంట్వెర్ప్ నుంచి ప్రారంభం కానుంది.ఈ విధానంలో భారీ కంటైనర్ నౌకలు యూరప్ నుంచి సూయజ్ కాలువ మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకుని, సౌదీ అరేబియాలోని జెడ్డా, కింగ్ అబ్దుల్లా పోర్టుల్లో సరుకులను దింపుతాయి. అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలోని దమ్మామ్‌కు సరుకులు తరలించనున్నారు. అనంతరం చిన్న ఫీడర్ నౌకల ద్వారా దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ వంటి దేశాలకు పంపిణీ చేస్తారు.ఈ మార్పుతో సరఫరా గొలుసు ఆలస్యం కావడంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ట్రక్కుల ద్వారా దీర్ఘదూర రవాణా అవసరం పెరగడంతో ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చివరికి ఈ అదనపు వ్యయ భారం వినియోగదారులపై పడే అవకాశం ఉంది. దీంతో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈ సంక్షోభ పరిస్థితుల్లో Hapag-Lloyd, Maersk వంటి ఇతర అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజాలు కూడా “ల్యాండ్బ్రిడ్జ్” వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఒమన్, సౌదీ అరేబియా మార్గాల ద్వారా సరుకులను తరలిస్తూ సముద్ర మార్గాలపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.ప్రస్తుతం ఒమన్, యూఏఈ తూర్పు తీరాల్లో సరుకుల నిల్వలు పెరుగుతుండగా, ట్రక్కుల కొరత కూడా కనిపిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం కొత్త అనిశ్చిత దశలోకి ప్రవేశించిందని సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa