ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ కీలక ప్రకటన: యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి అవసరం

national |  Suryaa Desk  | Published : Sat, May 02, 2026, 10:40 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.ప్రస్తుతం ప్రాంతంలో శాంతి లేకుండా, తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు తిరిగి రావాలంటే ఈ సంక్షోభాన్ని ప్రారంభించిన పక్షాలే బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.యుద్ధాన్ని నివారించేందుకు ఇరాన్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆయన తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగానే ప్రతిచర్యకు దిగాల్సి వచ్చిందని ఆరోపించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్న సమయంలోనే భారీ దాడులు జరగడంతో సుప్రీం లీడర్ సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.ఈ ఘర్షణల్లో దేశవ్యాప్తంగా సుమారు 4 వేల మంది మృతి చెందగా, దాదాపు 40 వేల మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా పేర్కొన్నారు. చిన్నారులు, సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా, ఇజ్రాయెల్ తమను లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ అలాంటి ఒత్తిడిని ఎవరూ అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దాన్ని ప్రారంభించిన దేశాలపైనే ప్రపంచ సమాజం ఒత్తిడి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. ఈ దాడుల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa