ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివ‌సేన బీజేపీని టార్గెట్ చేసిందా?

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 06:39 PM

శివ‌సేన పార్టీ తీరేంటో బీజేపీ నేత‌ల‌కు బోధ ప‌డ‌టం లేద‌ట‌. శివ‌సేన త‌న‌కు మిత్ర ప‌క్ష‌మో, శ‌త్రు ప‌క్ష‌మో అర్థం కావ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు బ‌హిరంగంగానే చెబుతున్నార‌ట‌. అంతేకాదు, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శివ‌సేన ఒంటిరి పోరాటానికి సిద్ధం అవుతుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఓ వైపు ఎన్డీయేలో కొన‌సాగుతూనే, పొత్తు ధ‌ర్మంలో భాగంగా సీట్లు తీసుకుంటూనే, మ‌రోవైపు ఏదో ఒక మిష‌తో బీజేపీ మీద ఆరోప‌ణలు సంధిస్తోంది శివ‌సేన‌. ముఖ్యంగా ఆ పార్టీ అధికార ప‌త్రిక సామ్నాలో బీజేపీ నిర్ణ‌యాల‌ను విమ‌ర్శిస్తూ ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీ మ‌ధ్య సీట్లు స‌ర్దుబాటు దాదాపుగా ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అన్న స‌మ‌యంలో తాజాగా బీజేపీ మీద‌ మ‌రో ఆరోప‌ణ చేసింది శివ‌సేన‌.
ఈ నాలుగేళ్ల‌లో మ‌హారాష్ట్ర‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయ‌నీ, వాటి నివార‌ణ కోసం ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్ర‌భుత్వ ఏం చ‌ర్య‌లు తీసుకుందో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ల మీద ప్ర‌భుత్వం వెంట‌నే స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని శివ‌సేన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద సామ్నాలో ఎడిటోరియల్ కూడా ప్ర‌చురించింది ఆ పార్టీ. అంతేకాదు, ఈ ఐదేళ్ల‌లో తాము ఏం చేశామో మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డానికి ర‌థ‌యాత్ర చేప‌ట్టింది బీజేపీ. ఈ యాత్ర మీద కూడా శివ‌సేన అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన త‌ర్వాతే ర‌థ‌యాత్ర చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేత‌లు. రైతుల‌కు ఏం చేశార‌ని యాత్ర త‌ల‌పెట్టార‌నీ, రుణ‌మాఫీ మీద ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక పోవ‌డం వ‌ల్లే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు శివ‌సేన నేత‌లు. అంతేకాదు, అయోధ్య రామాల‌య నిర్మాణం కోసం అప్ప‌ట్లో లాల్ కిష‌న్ అద్వానీ చేప‌ట్టిన యాత్ర‌కు 25 సంవ‌త్స‌రాలు పూర్తి అయ్యాయ‌నీ, కానీ ఇప్ప‌టి దాకా రామ మందిర నిర్మాణం మీద బీజేపీ ఎలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించింది. ఇదంతా చూస్తున్న మ‌హారాష్ట్ర జ‌నం శివ‌సేన నేత‌ల‌ను చూసి న‌వ్వుకుంటున్నారు. ఎందుకంటే రెండు పార్టీల పొత్తుతోనే ప్ర‌భుత్వ న‌డుస్తోంది. ఫ‌డ్న‌వీస్ మంత్రివ‌ర్గంలో శివ‌సేన నేత‌లు కూడా ఉన్నారు. అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు రాకుండా, తాము మ‌ద్ద‌తు ఇస్తున్న ప్ర‌భుత్వం తామే ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa