తిరుమల శ్రీవారి ఆలయంలోని మండపాలను ఆనాటి చక్రవర్తులు, రాజులు అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంలో నిర్మిచారు. ఇందులో మహాద్వారం, కృష్ణరాయమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఐనా మహల్, ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పైకప్పు, స్థంభాలపై కృష్ణస్వామివారు, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర దేవతా మూర్తులు, లక్ష్మీదేవి అమ్మవారి వివిద రూపాలు, జంతువులు, లతలు, పుష్పాలతో కూడిన శిల్పాలతో నిర్మించారు.
ప్రధాన గోపురం లేదా మహాద్వారంను 13వ శతాబ్ధంలో నిర్మించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం వ్రేలాడదీయబడి ఉంటుంది.
కృష్ణరాయమండపం :
మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్థంభాలపై ముసలిపై ఉన్న సింహం, దానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాలతో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమండపం. ఈ మండపంలో కుడివైపున తిరుమల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.
రంగనాయక మండపం :
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ.శ 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారు. ఈ మండమంలో వివిద రకాల శిల్పాలతో సుందరంగా మండప నిర్మాణం జరిగింది. క్రీ.శ 1320 – 1360 మధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదా శీర్వచనంతోపాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు.
తిరుమలరాయ మండపం :
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే అన్నా – ఊంజల్‌మండపం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగా, క్రీ.శ.16వ శతాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆరవీటి తిరుమలరాయలు నిర్మించాడు. ఇందులోని స్థంభాలపై శ్రీ వైష్ణవ, పశు-పక్షదుల శిల్పాలు ఉన్నాయి. ఈ మండపంలో రాజా తోడరమల్, అతని తల్లి మాతా మోహనా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్రహలు ఉన్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందు కుంటారు.
అద్దాల మండపం – ఐనా మహల్ :
కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఐనా మహల్ అంటారు. దీనిని 36 స్థంభాలతో అద్బుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం దీనికి అంతరాళం గర్భగృహం ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు.
ధ్వజస్తంభ మండపం :
రెండవ గోపురమైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజయనగర చక్రవర్తి సాళ్వ నరసింహరాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాలతో నిర్మిచిన మండపంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాలపై వివిద దేవతామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాలను తెలిపే అనేక శిల్పాలు పొందుపర్చారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
కళ్యాణ మండపం :
శ్రీవారి గర్భాలయానికి దక్షిణంవైపు క్రీ.శ.1586లో శ్రీ అవసరం చెన్నప్ప అనే నాయకుడు కల్యాణ మండపాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో 27 స్థంబాలతో నిర్మించారు. ఇందులో మధ్య భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నాది. పూర్వకాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీమలయప్పస్వామివారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహించేవారని అర్చకులు తెలిపారు.
ఆలయంలోని మండపాల శిల్ప సౌందర్యాన్ని భక్తులు తిలకించేలా టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి దశలో రంగనాయకుల మండపంలో స్తంభాలపై ఉన్న శిల్పాల సహజ సౌందర్యం మరింత ఇనుమడించేలా ఎల్ఈడీ స్పాట్ లైట్లను అమర్చారు. గోడ పైకప్పు వద్ద గోడకు ఉన్న శిల్పాలు ఆకర్షణీయంగా కనిపించేలా ఎల్ఈడీ స్ట్రిప్ లతో లీనియర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయంలోని అద్దాల మండపం, కల్యాణమండపం తదితర ప్రాంతాలలో దశల వారీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa