ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతికున్న చేపను మింగుతూ టిక్‌టాక్..వ్యక్తి మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Jun 14, 2020, 10:38 AM

టిక్‌టాక్ ఇప్పుడు చాలా మందికి‌ వ్యసనంగా మారింది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బతికున్న చేపను మింగుతూ టిక్‌టాక్ వీడియో తీస్తూ కాసేపటికే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. టిఓఐ కథనం మేరకు.. కృష్ణగిరి జిల్లా హోసూర్‌ పార్వతి నగర్‌కు చెందిన శక్తివేల్‌ కుమారుడు వెట్రివేల్‌(22) భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు(2) ఉన్నారు. వెట్రివేల్‌ తన ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడే మద్యం సేవించిన వీరంతా ఆ మత్తులో టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. ఈ సమయంలోనే వెట్రివేల్ బతికున్న చేపను మింగుతూ వీడియో తీసుకున్నాడు. అయితే చేప అతడి శ్వాసనాళంలో చిక్కుకోవడంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుని చనిపోయాడు. స్నేహితులు అతడిని వెంటనే హోసూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై హోసూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిక్‌టాక్ వ్యసనానికి భర్త చనిపోవడంతో రెండేళ్ల బిడ్డతో వెట్రివేల్ భార్య ఒంటరిగా మిగిలింది. ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa