మన దేశంలో చాలా ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో సరైన వైద్యం అందక చాలామంది గర్భిణులు చనిపోతున్నారు. అలాంటి మరణాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గర్భిణీలకు వైద్యం అంది.. వారు సురక్షితంగా ఉండేందుకు కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం. ఈ పథకాన్ని కేంద్రం 2016లో ప్రవేశపెట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ స్కీమ్‌ను నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రతి గర్భిణికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉచితంగా మందులు, భోజనం, రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా నూటికి నూరు శాతం ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేస్తారు. ఒకవేళ 9వ తేదీ సెలవు రోజు అయినా సరే సంబంధిత అధికారులు విధులు నిర్వర్తిస్తారు. ఈ పథకంలో భాగంగా మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని రకాల సేవలను ఉచితంగానే అందిస్తారు. ఇందుకోసం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రి రికార్డుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆశ కార్యకర్తలకు, ఏఎన్‌ఏంలను, అంగన్ వాడీ సెంటర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్‌లో పేరును నమోదు చేయించుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు పొందవచ్చు.లేదంటే PRADHAN MANTRI SURAKSHIT MATRITVA ABHIYAN (ప్రధాన మంత్రి సురక్షిత్ మంత్రిత్వ అభియాన్) వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గర్భిణుల పేరున ఓ కార్డును అందిస్తారు. ఈ పథకంలో గర్భిణులకు అన్ని సేవలూ అందుతాయి. రక్త పరీక్షల్లో హిమోగ్లోబిన్ పరీక్ష, రేండమ్ బ్లడ్‌షుగర్, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, రక్త వీడీఆర్‌ఎల్, బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ టైపింగ్, మూత్రపరీక్ష, థైరాయిడ్, గ్లూకోజ్ చాలెంజ్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. ఇవన్నీ ఫ్రీగా చేస్తారు. ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తీవ్రతను బట్టి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. గర్భిణులకు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి, వారి రిపోర్ట్ వివరాలను అందించడానికి నిత్యం ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య పెరిగింది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేయడం, అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవలందించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే ఇప్పటికీ చాలా తక్కువమందికి మాత్రమే ఈ స్కీమ్ గురించి తెలుసు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa