ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దూకుడు మంత్రాన్నే జపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను సమర్ధవంతంగా అణదొక్కుతున్న జగన్ సర్కార్ అదే ఫార్మూలాను ప్రభుత్వ ఉద్యోగులపై సైతం ప్రయోగిస్తుండటం శోచనీయంగా మారుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఎన్నో సం క్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలకం. అదేవిధంగా సర్కారుకు ఆదాయం, ఇతరత్ర మంచి పేరు రావాలన్నా కూడా ఉద్యోగుల పనుతీరుతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి ఆయువుపట్టు లాంటి ఉద్యోగులతో ప్రభుత్వం ఏరికోరి కయ్యానికి కాలుదువ్వు తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏపీ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సీఎంను కలిసి తమ గోడు విన్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే వీరికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ సంఘాల సమ్మెకు సిద్ధమయ్యాయి.
ఈక్రమంలోనే పదిరోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటిని ఉద్యోగ సంఘాలు నమ్మడం లేదు. ఒక్క పీఆర్సీ సమస్యే కాకుండా మరో డబ్బై సమస్యలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు చెబుతున్నారు. జగన్ సర్కారు తీరును ప్రజల సాక్షిగా ఎండగట్టేలా నిరసనలు చేపడుతున్నారు.
నిన్నటి వరకు వీరిని ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి కంట్రోల్ చేసేవారు. ప్రస్తుతం వీరివురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు దిగడంతో వైసీపీ నేతలు తమ వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా స్టేట్స్ మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ రెవిన్యూ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్న వీ.ఎస్.దివాకర్ తమకు సీఎంపై నమ్మకం ఉందని ప్రకటన చేశారు.
ఇదే సమయంలో బొప్పరాజు చంద్రబాబు వద్ద రెండు కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం పేరుతో తెరపైకి వచ్చిన మరికొందరు ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల సలహాదారు పదవి పొందిన చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఏపీ ఎన్జీవో నేతగా పని చేశారు. దీంతో ఆయన తన పలుకుడిబడితో ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా కొందరిచే ప్రకటనలు ఇప్పిస్తున్నారన్న ప్రచారం ఉద్యోగుల్లో నడుస్తోంది.
కాగా ఇప్పటికే ఉద్యోగ సంఘాల్లో స్పష్టంగా చీలిక వచ్చినట్లు కన్పిస్తుంది. ఈక్రమంలోనే బొప్పరాజు, బండి శ్రీనివాసరావులపై ఎదురుదాడి ప్రారంభమనట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల తీరు చూస్తుంటే మున్ముందు ఈ దాడి మరింత తీవ్ర కానున్న నేపథ్యంలో వీరివురు వెనక్కి తగ్గకతప్పదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి ఆందోళనలను విరమిస్తే తమ జీతాలు కూడా సమయానికి రావనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa