అత్తను అరెస్ట్ చేయాలని సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మదనపల్లె పట్టణంలోని రాజీవ్ నగర్లో క్రాంతి, ప్రమీల దంపతులు. క్రాంతి జల్సాలకు అలవాటు పడి కొంత కాలంగా భార్య పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు. డబ్బు అంతా తాగుడుకు ఖర్చు చేస్తుండటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని ఎంత బతిమిలాడినా ఆమె రాలేదు. ఇటీవల తన భార్యను తీసుకువచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన క్రాంతికి ఆమె అత్త ఊహించని షాక్ ఇచ్చింది. ఇక తన కూతురు నీతో వచ్చే ప్రసక్తేలేదని తేల్చేసింది. దీంతో క్రాంతి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. సబ్ కలెక్టర్ ను పిలిపించాలని, అతడితోనే తన గోడును వెల్లబోసుకుంటానని చెప్పాడు. అలాగే తన అత్తను అరెస్ట్ చేస్తేనే కిందకు దిగుతానని భీష్మించుకూర్చున్నాడు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరకు అత్తపై కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడు కిందకు దిగేలా చేశారు.