ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాధిలోంచి లాగి బయటకు తెస్తాం.. ఎస్ఐఆర్‌‌పై సీఈసీకీ ఎమ్మెల్యే వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 09:15 PM

కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ్ బెంగాల్ ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ నేత మొనీరుల్ ఇస్లాం తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తృణమూల్, ఈసీ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం అధికారులను కర్రలతో కొట్టి నడుము విరగ్గొడతామని ఇస్లాం హెచ్చరించారు. ఈసీ అధికారులకు చట్టపరమైన రక్షణ కల్పించే వివాదాస్పద చట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొనీరుల్ ఇస్లాం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఫరాక్కా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే.. ‘సమాధిలోంచి లాగి బయటకు తీస్తాం’ అని అసభ్య పదజాలంతో విమర్శించారు. బెంగాల్ ప్రజలను హింసిస్తూ, బీజేపీని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు బీజేపీ గెలుపు కోసమేనని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈసీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.


‘వాళ్లను (ఈసీ) కర్రలతోనే విరగ్గొట్టాలి. ఎన్నికల సంఘం నడుము విరగ్గొట్టడానికి మాకు కర్రలు కావాలి. మీరు ప్రజలతో ఆడుకుంటున్నారు కానీ రక్షణ కవచంలో కూర్చున్నారు’ అని ఇస్లాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కలుగులో ఉన్నారు.. కానీ మేము మిమ్మల్ని (కుమార్‌ను ఉద్దేశించి )బయటకు లాగుతాం... భూమిలోంచి లాగి తెస్తాను’ అని అన్నారు.


ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఎన్నికల సంఘంపై భౌతిక చర్యలు తీసుకోవాలని తృణమూల్ అగ్రనేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా గతంలో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా అన్ని అడ్డంకులు తొలగించి పోరాడాలి అని పార్టీ కార్యకర్తలకు బెనర్జీ సూచించారు. ‘స్థానిక బీజేపీ నాయకులు వస్తే... వారిని చుట్టుముట్టి, వారి తాతల సర్టిఫికెట్లు చూపించమని అడగండి...’ అని ఆయన అన్నారు.


ఇస్లాం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన వైఫల్యానికి ఇది నిదర్శనమని ఆయన విమర్శించారు. ‘అంతా మమతా బెనర్జీ ప్రత్యక్ష ఆదేశాలతోనే జరుగుతోంది.. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పరిశ్రమలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా, ఎన్నికల ముందు కేవలం రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నారు’ అని ఆయన అన్నారు.


ప్రజా సమస్యలపై చర్చ లేదు... కేవలం రాజకీయ బెదిరింపులు. ఎస్ఐఆర్‌‌ ఒక్కటే ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందనే వాతావరణాన్ని ముఖ్యమంత్రి సృష్టించారు’ అని చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ మధ్య ఉన్న విభేదాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఇండియా కూటమిలో టీఎంసీ ఉన్నప్పటికీ, సీట్ల పంపకం వంటి విషయాల్లో ఇరు పార్టీలు ఎప్పుడూ ఏకాభిప్రాయానికి రాలేదని ఆయన అన్నారు.


ఇస్లాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన హింస నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు ఇస్లామే కారణమని బీజేపీ నేత అమిత్ మాలవ్య ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సమయంలో వేధింపులకు నిరసనగా ఈ దాడి జరిగిందని, ఈ ప్రక్రియలో ఇప్పటికే నమోదైన ఓటర్ల నుంచి అదనపు వివరాలు అడుగుతున్నారని ఆయన తెలిపారు.


ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ తృణమూల్, బీజేపీ, ఈసీ మధ్య పెద్ద వివాదంగా మారింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఎస్ఐఆర్‌‌ అనేది లక్షలాది మంది అర్హత గల ఓటర్లను ముఖ్యంగా తృణమూల్‌ మద్దతుదారులను తొలగించే కుట్ర అని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే, రాజ్యాంగం ప్రకారం ఎస్ఐఆర్‌‌ ప్రక్రియ తమ విధిలో భాగమని ఎన్నికల సంఘం చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa