ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు కేంద్రం ఝలక్.. కఠిన రూల్స్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:12 PM

మీరు మీ కారును ఎవరికైనా అమ్మాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆగండి! కేంద్ర ప్రభుత్వం వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకువస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ (సవరణ) నిబంధనలు 2026ను ప్రవేశపెట్టింది. ఇకపై ఒక కీలకమైన పని పూర్తి చేయకుండా మీరు మీ వాహనాన్ని వేరొకరి పేరు మీదకు బదిలీ చేయడం కుదరదని రవాణా శాఖ స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై వాహనాలకు సంబంధించిన కీలక సేవలపై టోల్ ఫీజు బకాయిల ప్రభావం పడనుంది.


రహదారుల వినియోగ రుసుములు (టోల్ ఫీజు) చెల్లింపులను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏదైనా వెహికల్ టోల్ ప్లాజాల వద్ద చెల్లించాల్సిన బకాయిలు ఉంటే ఆ వాహానికి పలు సేవలు నిలిపివేయనున్నారు. సదరు వాహనాన్ని వేరే వ్యక్తికి అమ్మాలన్నా లేదా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్నా అవసరమయ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేయరు. టోల్ బకాయిలు ఉంటే ఎన్ఓసీ రాదు. అలాగే వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణను టోల్ బాకీలు చెల్లించే వరకు నిలిపివేస్తారు. రవాణా వాహనాలకు అవసరమైన పర్మిట్లను కూడా టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు జారీ చేయరు.


  అంటే మీరు ఏదైనా టోల్ ఫీజు చెల్లించకుండా బాకీ పడితే మీ వాహనం అమ్మడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. టోల్ ఛార్జీలను పూర్తి చెల్లించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందితేనే ఇతర రాష్ట్రాల బదిలీ చేయవచ్చు. అందుకే వాహనాదారులు ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాలి. టోల్ ఛార్జీల బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఈ సవరణలకు సంబంధించి 2025 జూలై 11న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల నుంచి సూచనలు స్వీకరించారు. వచ్చిన ఫీడ్ బ్యాక్ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తుది నిబంధనలు ఖరారు చేసింది. ఈ మేరకు 2026, జనవరి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.


టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘించడం లేదా బకాయిలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల టోల్ ఆదాయం పెరగడమే కాకుండా, వాహనదారులు క్రమశిక్షణతో వ్యవహరించేలా ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వాహన యజమానులు తమ వాహనాలపై ఏవైనా టోల్ బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో భవిష్యత్తులో వాహనం అమ్మకం లేదా ఇతర ఆర్టీఓ పనుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa