అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఓ బాలికకు ఉచిత వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే చిత్తూరుకు చెందిన ఓ బాలిక గోషే అనే వ్యాధితో బాధపడుతోంది. తనకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును అందించాలంటూ ఆ బాలిక హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ మేరకు బాలిక తరఫున న్యాయవాది రాజేశ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఇలాంటి అరుదైన వ్యాధి బాధితులు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉంటారని, వారి జీవితం కుచించుకుపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. బాలికకు ఎంజైమ్ మార్పిడి చికిత్స చేయాలి. 2 వారాలకు ఒకసారి ఎంజైమ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇందుకోసం సుమారు ఏడాదికి రూ. 25 లక్షల ఖర్చు అవుతుందని పిటిషనర్ తెలిపారు.
కాగా ఇలాంటి వ్యక్తిగత ఖర్చులను భరించే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని కేంద్ర సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్ జీ) హరినాథ్ తెలిపారు. ఇలాంటి బాధితులకు వ్యక్తిగత సాయమందించే విధానమేమీ లేదని ఆయన వాదనలు వినిపించారు. ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తరపున న్యాయవాది ఆరోగ్యశ్రీ వివరాలను వెల్లడించారు. అయితే బాలిక వ్యాధికి సంబంధించి ఈ పథకంలో ఎలాంటి బీమా వర్తించదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు పేదరికంతో అరుదైన వ్యాధిగ్రస్తులు కన్నుమూసేలా ప్రభుత్వాలు వదిలేయకూడదని, ఈ మేరకు గతంలో ఎన్నో న్యాయస్థానాలు ఈ విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు. బాలిక బాధపడుతున్న వ్యాధికి ఆరోగ్య బీమా ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదేవిధంగా చికిత్సకు అయ్యే ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్ ఫండింగ్ సహా అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa