తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడని ఓ మహిళ దారుణానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి ఆదివారం వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచికట్ల శ్రీనివాస్(42), జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మండలం వేంపేట్ కు చెందిన స్వప్న హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. స్వప్నకు ఇదివరకే వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఒక కుమారుడు జన్మించాక వారు విడిపోయారు. శ్రీనివాస్, స్వప్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి ఉప్పల్, వేంపేట్‌లలో ఇళ్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఓ మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెతో పాటు కలిసి ఉందామంటూ భార్యను వేధించసాగాడు. దీంతో అతన్ని చంపేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని స్వప్న భావించింది.
ఈ నెల 22న రాత్రి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారితో రూ.5 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్ పై రోకలిబండతో దాడి చేసి చంపేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లాలోని కనకాపూర్ సమీపంలోని వాగులో మృతదేహాన్ని పడేశారు. ఈ కేసును ఛేదించిన లక్ష్మణచాంద పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. 10 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa