ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్, పాన్ కార్డు ఇలా ఐడెంటిటీ కార్డులన్నింటినీ అనుసంధానం చేస్తూ కొత్తగా 'ఒకే డిజిటల్ ఐడీ'ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ ను డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్)గా రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం.
ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు.. కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలో భాగంగా ఆధార్ కార్డు నంబరు మాదిరిగా ఈ ఐడీకి కూడా ఓ గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
కేవైసీ లేదా ఈ-కేవైసీకి ఈ డిజిటల్ ఐడీని వినియోగించుకోవచ్చు. ఇన్ని కార్డుల కంటే ఒకే డిజిటల్ ఐడీ ఉండటం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. దీన్ని త్వరలోనే ప్రజాభిప్రాయానికి కేంద్ర ఐటీ శాఖ అందుబాటులో ఉంచుతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa