ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈమెకి పట్టుదల ఎక్కువ.. బైక్ పై ఎక్కడికైనా దూసుకెళుతుంది..!

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:31 PM

అమ్మాయిలు బైక్ నడుపుతాం అంటే చాలా మంది వద్దంటారు. బైక్స్ మగవాళ్లు మాత్రమే నడపాలని అంటుంటారు కొందరు. అయితే ఓ యువతి పట్టుదలతో బైక్ నేర్చుకుని దేశంలోనే అత్యంత ఎత్తున ఉన్న ప్రదేశానికి బైకుపై వెళ్లి జాతీయ జెండాను ఎగరేసింది. ఆమె పేరు కంచన్‌ ఉగుర్‌సాందీ.

ఝార్ఖండ్‌ లోని సెరైకెలా ప్రాంతంలోని పేద గిరిజన కుటుంబానికి చెందిన కంచన్‌ కు బైక్స్ నడపడం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువులో కూడా ముందంజలో ఉండేది. బెంగళూరు నుంచి ఫార్మసీలో డిగ్రీ పట్టా పొందింది. ఆ గ్రామంలోని కుర్రాళ్లు బైక్ పై తిరుగుతోంటే తనూ నేర్చుకోవాలనుకుంది. ఇంట్లో చెబితే ‘అవి అబ్బాయిలవి. నువ్వు నడపకూడ’దన్నారు. పట్టుబడితే.. కాస్త దిగొచ్చి స్కూటర్‌ నేర్చుకోనిచ్చారు. కంచన్‌ కు 2019లో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో క్లినికల్‌ ఫార్మసిస్ట్‌ గా జాబ్ వచ్చింది. జీతం అందుకోగానే ఆమె మొదట కొంత మొత్తం చెల్లించి లోను ద్వారా బైకు తీసుకుంది. ఆఫీసులోని సీనియర్ల సాయంతో నేర్చుకుంది. పట్టురాగానే ఒంటరిగా ఆగ్రాకు వెళ్లింది. ఆ తర్వాత రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌, లేహ్‌ ఇలా ఎన్నో ప్రదేశాలను చుట్టేసింది.

కంచన్‌ కు సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) గురించి తెలిసింది. పహారా కాస్తూనే వాతావరణ పరిస్థితులకు, శత్రువులకు ఎదురోడుతూ సైనికులు ఈ రహదారులను నిర్మిస్తున్నారని తెలిసి, వాళ్లని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. ఆ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మిస్తున్న ఉమ్లింగల రహదారి గురించి తెలుసుకుంది. అక్కడికి ఒంటరిగా వెళ్లడం కోసం అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, పొందింది. అక్కడికి చేరుకుని ఆ ఘనత సాధించిన తొలి బైకర్‌గా నిలిచింది.

ప్రపంచానికి ఎత్తైన ప్రదేశంలో 17 మలుపులు దాటుకుంటూ ఉమ్లింగ లా పాస్‌ కు చేరుకుని ఆమె జాతీయ జెండాను ఎగరవేసింది. అది తనకు చాలా గర్వమనిపించిందని ఆమె తెలిపారు. ఏదైనా సాధించాలనిపిస్తే ధైర్యంగా ప్రయత్నించాలని, ఎప్పుడూ తమ సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దని అమ్మాయిలకు ఆమె సందేశమిస్తోంది. ఈ ప్రయాణమిచ్చిన ఉత్సాహంతో భూటాన్‌, మయన్మార్‌, కజికిస్థాన్‌లోని రహదారుల్లోనూ ప్రయాణిస్తానని చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa