గుంటూరు జిల్లా కారంపూడి ఆదర్శ పాఠశాల వసతిగృహంలో ఉండే 15 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 9వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ చదివే విద్యార్థినులు 40 మంది వసతిగృహంలో ఉంటున్నారు. మంగళవారం విద్యార్థినులకు కుళ్లిపోయిన వంకాయలతో కూర, సాయంత్రం కలుషితమైన శెనగలను గుగ్గిళ్లు చేసి వసతిగృహ నిర్వాహకులు పెట్టినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. దీంతో గృహంలోని విద్యార్థినుల్లో 15 మంది అర్ధరాత్రి 3 గంటల నుంచి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడారు.
వేకువన ఆరు గంటలకు విషయం తెలుసుకున్న నిర్వాహకురాలు సమాచారాన్ని పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణకు చెప్పారు. దీంతో ఆయన వైద్యుల సూచనతో కారంపూడిలోని మందుల దుకాణం నుంచి కొన్ని మందులు తీసుకొచ్చి విద్యార్థినులకు ఇచ్చారు. ఈక్రమంలో ఏడుగురు కోలుకోగా మిగిలిన ఎనిమిది మంది అస్వస్థతతో బాధపడ్డారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను ఇంటికి పంపారు. వసతిగృహంలోని సమస్యను ఓ విద్యార్థిని తండ్రి సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఘటనపై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే మందులు అందజేశామన్నారు. కలుషితమైన శనగలు, వంకాయలు తినటంతో పాటు ఆదివారం రోజున వారి కుంటుంబ సభ్యులు తెచ్చిన పదార్థాలు దాచుకొని తినటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa