ఏపీలో వచ్చే ఏప్రిల్ నుంచి ఆస్తుల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రకటన రాగానే కొన్నిచోట్ల భూముల ధరలు పెరిగాయి. తదనుగుణంగా మార్కెట్ విలువలూ సవరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆస్తుల విలువ పెంపును బట్టి కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పడనుంది. తాజాగా గ్రామాల్లో 2022 ఏప్రిల్ 1 నుంచి సవరించే మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా జిల్లా అధికారులు కమిటీల ద్వారా ఖరారు చేయాలని గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆస్తుల విలువ సవరణకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు 2022 ఏప్రిల్ 1 కాగా, గుంటూరు జిల్లా బాపట్ల, నరసరావుపేట పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫిబ్రవరి 1 నుంచే కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ పట్టణాలను ప్రభుత్వం ఇటీవల జిల్లాలుగా ప్రకటించింది. వీటికి సమీపంలోని సుమారు 20 గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఆస్తుల విలువ పెంచేసింది.
నరసరావుపేట శివారు గ్రామాల్లో పెంపు 100 శాతంగా ఉంది. బాపట్లలోని ఈస్ట్ బాపట్ల, వెస్ట్ బాపట్ల, అడవి, అప్పికట్ల, మరుప్రోలువారిపాలెం, ఈతేరు, మురుకొండపాడు, గణపవరం, కర్రపాలెంలో మార్కెట్ విలువ పెంచారు. పట్టణంలో గజం భూమి విలువ రూ.2,100 నుంచి రూ.3,000 కు సవరించారు. కొన్నిచోట్ల ఎకరాకు రూ.5.25 లక్షలు ఉంటే రూ.7 లక్షలకు పెంచారు. తెనాలి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ కొంతవరకు సవరించారు. నరసరావుపేట పట్టణ సమీపంలోని రావిపాడు మినహా మిగిలిన గ్రామాల్లో వ్యవసాయేతర భూముల విలువ పెరిగింది. గజం రూ.1,800 నుంచి రూ.3వేలకు పెంచారు. రావిపాడులో ఏకంగా రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆస్తుల విలువ సవరణ వల్ల కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపేణా ఎకరాకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు భారం పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa