ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ ముఖ్యమంత్రికి ఈడీ షాక్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:43 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌ రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడుగా ముందుకెళ్తోంది. సీఎం చన్నీ బంధువును, ఎన్నికల ముందు అరెస్టు చేసింది. ఈ ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అక్రమ మైనింగ్‌ చేశాడనే అభియోగాలతో మనీ లాండరింగ్‌ చట్టం ప్రయోగించి, సీఎం చన్నీ మేనల్లుడిని అరెస్టు చేసింది. దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం అర్ధరాత్రి అరెస్టును ఈడీ అధికారులు ప్రకటించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.


పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడు భూపిందర్‌ సింగ్‌ హనీపై ఇసుకను అక్రమంగా మైనింగ్‌ ఆరోపణలు ఇటీవల కాలంలో గుప్పుమన్నాయి. దీనిపై ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. పంజాబ్ ఎన్నికలు వస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల వేడి పెరిగింది. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగింది. జనవరి 18న భూపిందర్‌ సింగ్‌ ఇంటితో పాటు మరో పదిచోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. దాడుల్లో భూపిందర్‌ ఇంట్లో రూ.7.9 కోట్లు, ఆయన సన్నిహితులు సందీప్‌ కుమార్‌, కుద్రదీప్‌ సింగ్‌ ఇళ్లలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈ ముగ్గురూ ప్రొవైడర్స్‌ ఓవర్సీస్‌ సర్వీసెసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నట్లు గుర్తించింది. వారిపై ఇసుక అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో అభియోగాలు మోపి, మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.


సరిగ్గా ఎన్నికల ముందు సీఎం చన్నీ మేనల్లుడిని ఈడీ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమయింది. 117 సీట్లున్న పంజాబ్‌ అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa