ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో నకిలీ బాబా రాసలీలలు.. భాగోతం బయటికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:48 AM

సమస్యల్లో ఉన్న వారి బలహీనతలే ఆసరాగా తీసుకుని, చెలరేగిపోయే దొంగబాబాలు సమాజంలో నిత్యం పుట్టుకొస్తున్నారు. తమను ఆశ్రయించే మహిళలు, యువతుల జీవితాలతో వారు ఆడుకుంటున్నారు. కొంతమంది లైంగిక దోపిడీ చేస్తే, మరికొంతమంది అందినకాడికి డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా ఏపీలో ఓ నకిలీ బాబా భాగోతం బయటపడింది.


దీనికి సంబంధించి పోలీసులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన అంబటి అనిల్ అనే వ్యక్తి గతంలో రైల్వేలో టీసీగా విధులు నిర్వర్తించాడు. చక్కటి ఉద్యోగం వదిలేసి, ప్రేమదాసు బాబాగా కొత్త అవతారమెత్తాడు. దీంతో పాటు విశాఖ జిల్లా పాయకరావుపేటలో తన పేరుతో చిన్న ఆశ్రమం సైతం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ సమస్యలతో వచ్చే వారిని తన బోధనలతో ఆకట్టుకునేవాడు. క్రమంగా తనను ఆశ్రయించే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వారి నుంచి భారీగా విరాళాలు సేకరించడం మొదలు పెట్టాడు. ఆ డబ్బుతో ఓ విలాసవంతమైన భవనాన్ని నిర్మించేశాడు. కష్టసుఖాలు చెప్పుకునేందుకు వచ్చిన యువతులను లొంగదీసుకోవడం ప్రారంభించాడు. ఆ భవనంలోనే వారితో రాసలీలలు సాగిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవాడు.


ఈ క్రమంలో ఆ దొంగబాబాను తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఆశ్రయించింది. అతడి మాయలో చిక్కుకుంది. బాబా వికృత చేష్టలు భరించలేకపోయింది. చివరికి ధైర్యం చేసి, కొందరు యువకుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, పలు రకాల సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడంతో, పోలీసులు బాబా ఆటకట్టించారు. బాబా భవనంలో తనిఖీలు చేపట్టి, అక్కడి యువతులను రక్షించారు. బాధిత మహిళల నుంచి ఫిర్యాదు తీసుకుని, కేసులు నమోదు చేశారు. అయితే వారిలో కొందరు, తాము ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్లు పోలీసులకు చెప్పడం కొసమెరుపు.


ప్రేమదాసు బాబా బాధితుల్లో కడప, విజయవాడ, కర్నూలుకు చెందిన 30మందికి పైగా మహిళలు, యువతులు ఉన్నట్లు తేలింది. తమను బంధించి, వెట్టిచాకిరీ చేయించేవాడని బాధిత మహిళలు బోరుమన్నారు. అంతే కాకుండా లైంగికంగా వేధించేవాడని విలపించారు. నగ్న చిత్రాలు చూపించి, వికృతంగా ప్రవర్తించేవాడని పేర్కొన్నారు. ఓ యువతికి ఇష్టం లేకున్నా, బలంవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేసిన ఉదంతమూ బయటపడింది. ఓ యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడనే విషయమూ వెలుగులోకి వచ్చింది. దొంగబాబా బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa