ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కు పరిటాల శ్రీరామ్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 02:51 PM

అనంతపురం జిల్లా ధర్మవరం గురించి కానీ ఆ ప్రాంత చరిత్ర గురించి కానీ మీకు (రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి) తెలియనిది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం ఇది. అయితే జిల్లాల విభజన నేపథ్యంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేసిన అంశం మీకు తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద మొత్తం ధర్మవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇటు రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, రామగరి, కనగానపల్లి మండలాల ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కు ఒక చరిత్ర ఉందని తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ లేఖ రాశారు.


భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో అనంతపురం జిల్లా ఏర్పడింది. అప్పుడే ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. దాదాపు 1953 నుంచి రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతోంది. 24 మండలాలు గతంలో ధర్మవరం డివిజన్ లో ఉండేవి. కానీ నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు తదితర కారణాలతో మండలాలు తగ్గుతూ వచ్చాయి. తాజాగా జిల్లా విభజన నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మరియు చెన్నేకొత్తపల్లి కనగానపల్లి రాప్తాడు మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మార్చారు. దీని వలన కేవలం నాలుగు మండలాలు మాత్రమే ధర్మవరం పరిధిలోకి వచ్చాయి. అయితే వాటిని కూడా పుట్టపర్తిలో కలుపుతూ ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేశారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని చెప్పడానికి కారణాలు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడానికి ప్రస్తుతం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని ప్రజల అభిప్రాయం. నాలుగు మండలాలు, ఒకే నియోజకవర్గం అన్నది సరికాదు.


 


ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో నాయుడుపేట, తిరుపతి జిల్లాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్ లు. రెండు జిల్లాలతో కలసి ఉన్నాయి. అలాంటప్పుడు ధర్మవరంని ఎలా రద్దు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందునా ఇది ఏ ప్రాతిపదికన చేశారో ఒక నిర్ధిష్టమైన విధి విధానాలు కూడా చూపడం లేదు. అందుకే ధర్మవరం రెవెన్యూ డివిజన్ కు ఉన్న చరిత్ర దృష్ట్యా, అలాగే ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా ఇక్కడ డివిజన్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తాడిమర్రి మండల ప్రజలకు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇది ఏమాత్రం ప్రజా ఆమోదయోగ్యం కాదు. రాప్తాడు నియోజకవర్గం నుంచి రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలతో పాటు ధర్మవరంలో ఉన్న నాలుగు మండలాలు కలిపి ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను కొనసాగించవలసిందిగా కోరుచున్నాము. ధర్మవరంకు ఉన్న చరిత్ర, ఇతర ప్రజా అవసరాలను, మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకుని ధర్మవరం రెవెన్యూ డివిజన్ ని కొనసాగించాలని విన్నవించుకుంటున్నామని తెలియజేస్తూ లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa