ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్ బైక్ కు రూపకల్పన చేసిన ఎస్ఆర్ఎం విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 08:40 AM

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు లోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశారు. ఐసీ ఇంజన్ స్థానంలో లిథియమ్ అయాన్ బ్యాటరీని, వెనుక వీల్ కు మోటారు అమర్చడం వంటి ప్రయోగాలు మంచి ఫలితాన్ని అందించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ తో నడిచే టూ వీలర్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్ వాడకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన విద్యార్ధులు తమకున్న టెక్నాలజీని ఉపయోగించి రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైకు రూపకల్పన చేశారు. అమరరాజా బ్యాటరీస్ కంపెనీ వీరికి లిథియం అయాన్ బ్యాటరీని సమకూర్చి సహకారం అందించింది.


ఐసీ ఇంజిన్ కలిగిన పాత వాహనాన్ని తీసుకుని దానికున్న ఇంజిన్ను తొలగించి బ్యాటరీని అమర్చారు. బ్యాటరీలో నుంచి శక్తి ఉత్పన్నమై కంట్రోలర్ ద్వారా మోటారు చేరుతుంది. తద్వారా వాహనం నడుస్తుంది. రెండు నెలల పాటు శ్రమించిన విద్యార్థులు ఎట్టకేలకు వాహన రూపకల్పనలో విజయవంతమయ్యారు. తయారు చేసిన వాహనాన్ని రెండు దశల్లో పరీక్షించారు. వాయు, శబ్దకాలుష్యం లేని ఈ బైకు ను విద్యార్థులు యూనివర్సిటీలో ప్రదర్శించారు.


బ్యాటరీ ఛార్జింగ్ కు రెండున్నర గంటల సమయం పడుతుందని, దీనికయ్యే ఖర్చు రూ. 15 మాత్రమేనని విద్యార్థులు వివరించారు. ఒకసారి ఛార్జ్ అయిన బ్యాటరీ ద్వారా 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తే 35 కిలోమీటర్లు వెళ్లవచ్చని, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వాహనం నడుస్తుందని తెలిపారు. తాము రూపొందించిన ఈ బైకు మెయింటనెన్స్ తక్కువని, రివర్స్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ బ్రేక్ ను కూడా అమర్చినట్లు విద్యార్థులు వివరించారు.


ఈ బైక్ తయారీలో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రవితేజరెడ్డి, ఏ చైతన్య, పాబోలు మోహన్ ఆదిత్య, కే ప్రవీణ్, కే యశస్విని, శ్రావ్య, వాసు, ప్రియాంకలు ఉన్నారని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ నోరి వివరించారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం ధరఖాస్తు చేశామన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ ను యూనివర్సిటీ ప్రొ-వైస్ ఛాన్సలర్ ఆచార్య డి నారాయణరావు స్వయంగా పరిశీలించి విద్యార్థులను అభినందించారు. బైక్ రూపకల్పనలో పాల్గొన్న విద్యార్ధులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వజ్జా సాంబశివరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమకుమార్, యూనివర్సిటీ డీన్ ఆచార్య బీవీ బాబు, డాక్టర్ సుజిత్ కల్లూరిలు ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa