కనేకల్లు మండలంలోని కళేకుర్తి గ్రామానికి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు 6 కిలోమీటర్ల మేర కణేకల్లుకు పాదయాత్ర చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ గ్రామం మీదుగా ఉరవకొండకు, రాయదుర్గాని బస్సు సర్వీసులు నడుస్తున్నాయని, 2 రోజుల క్రితం బస్సు సర్వీసులను వేదావతి హగరి మీదుగా నడుపుతుండటంతో గ్రామానికి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పాదయాత్రగా వచ్చిన విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు శాంతరాజ్, శశికుమార్, మహేంద్ర, విజయ్ కుమార్ తది తరులు మద్దతు తెలిపి బస్టాండ్ వద్ద గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే బస్సు సర్వీసు పునరుద్ధరించకపోతే బస్సులను అడ్డుకుంటామని ప్రకటించారు.