దేశవ్యాప్తంగా కాలుష్యం నుంచి మానవాళిని కాపాడేందుకు ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలోనే నాలుగైదేళ్ల మధ్య కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో కూడా ఈ బస్సు సర్వీసుల వినియోగం ఊపందుకుంది. ఇటీవలి ముంబై, హైదరాబాద్, నాగపూర్, పుణె , డెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో ఈ-బస్సు సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయి.
ఆ బస్సు సర్వీసుల విజయవంతానికి కారణమైన ప్రముఖ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ తో ఒప్పందం కుదుర్చుకోడానికి 2019-20 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తి చూపింది. సుదీర్ఘ చర్చలు, పరిశీలన అనంతరం 12 ఏళ్లలో అంచెలవారీగా బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెట్టే నిమిత్తం రూ.140 కోట్లతో ఒప్పందం గత ఏడాది అక్టోబర్ లో ఖరారైంది. ఆ మేరకు ఆ సంస్థ అంచెలవారీగా రెండు, మూడు దశల్లో 50 నుంచి 100 ఈ-బస్సులను అందచేయనుంది. ఇదిగాక అద్దె పద్దతిలో ఈ బస్సు సర్వీసులను నడిపేందుకు పిలిచిన టెండర్‌ను దక్కించుకున్న ఈవే ట్రాన్స్‌పోర్ట్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా విజయవాడ, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో మరో 300 ఈ-బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
తొలిదశలో తిరుపతిలో...
ప్రస్తుతం ఓలెక్ట్రా గ్రీటెక్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం తిరుపతి కేంద్రంగా తొలిదశలో 50 ఈ-బస్సు సర్వీసులను ప్రజా రవాణాలో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. అధికారిక సమాచారం ప్రకారం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకం కింద ఏడాది పాటు బస్సుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఆ సంస్థ నిర్వహిస్తుంది. తొలిదశలో ప్రవేశపెట్టనున్న 50 ఈ బస్సు సర్వీసులను తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, కడప మార్గాలలో నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఎయిర్ కండిషన్ సదుపాయంతో అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టం కలిగి లిథియం ఇయాన్ బ్యాటరీలతో నడిచే 35 సీట్ల ఈ-బస్సులను ఒకసారి ఛార్జింగ్ చేయడానికి 8 నుంచి 4 గంటల సమయం పడుతుందని, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు నడుస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా స్థానిక అలిపిరి డిపో వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యా యి. ఈ-బస్సు ఛార్జీలను త్వరలో ప్రకటించడానికి ఆర్టీసీ అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..?
ఈ బస్సు సర్వీసుల గురించి రెండు రోజుల క్రితం అమరావతిలో వెల్లడించిన రాష్ట్ర శాఖ మంత్రి పేర్ని నాని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభింపజేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్, మే నెలల మధ్య కాలంలో ఈ బస్సు సర్వీసులు రోడ్డెక్కే అవకాశాలున్నాయని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు. త్వరలో రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థలో అడుగుపెడుతున్న ఈ బస్సు సర్వీసుల ప్రారంభానికి తిరుపతి వేదిక కానుందని స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa