ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 7న జరగనుంది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో సీఎం జగన్ ఈ నెల 7న కేబినెట్ సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం. దీంతో ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని సీఎం జగన్ ఈ నెల 8న గవర్నర్ ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్ ఆమోదం తెలపగానే కొత్తగా కేబినెట్ లోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
మరోవైపు ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు రాబోతున్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా ప్రైవేట్ ట్రావెల్స్ సహా రవాణా రంగంలోని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా తాను కృషిచేస్తానని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.