ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న గ్రామాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 04:13 PM

ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. విద్యుత్ కోతలకు సమయం సందర్భం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎడాపెడా విద్యుత్ కోతలు. దీంతో పల్లె, గ్రామ ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో అర్థం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు.


వేసవిలో ఈ విధంగా కరెంటు కోతలు విధిస్తే ఏ విధంగా జీవించాలని గ్రామ ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తే మా వద్ద ఎటువంటి సమాచారం లేదని పై నుంచి కరెంటు పోయింది అని సమాధానంతో గ్రామ ప్రజలు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. సమయం సందర్భం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తే ఎలా అంటూ సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉంటే అధికారులు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఫోన్ ఎత్తడం మానేశారు.


ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలలో పొలం బోర్ల నీటిపై ఆధారపడి పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి కూడా సమయం సందర్భం లేకుండా కరెంటు ఇవ్వటం చాలా తక్కువ సమయం కరెంటు ఇవ్వడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. దీనిపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కి ఇలా కరెంటు ఇవ్వకుండా చేస్తే ఎలా అని రైతులు అంటున్నారు.


ఒక ప్రభుత్వానికి ఎక్కువ ఓటు బ్యాంకు ఉండేది గ్రామీణ ప్రాంతాలలోనే. ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఆలోచించక ఉండలేరు అని విశ్లేషకులు అంటున్నారు. ఇలానే విద్యుత్ కోతలు కొనసాగితే ప్రభుత్వానికి భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇది ప్రభుత్వానికి సంబంధం లేదని సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి కరెంటు కోతలు విధిస్తున్నారని అంటున్నారు.


మరికొందరైతే ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటంతో విద్యుత్ కోతల సమస్య తలెత్తిందని అంటున్నారు. కనీసం విద్యుత్ కోతలు విధించే సమయాలు అయిన ప్రకటిస్తే ప్రభుత్వానికి గౌరవం ఉంటుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అంటున్నారు. రానున్న రోజుల్లో కరెంటు కోతలు తగ్గించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందో లేదో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa