పాకిస్థాన్‌లో నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ హైడ్రామాకు నేడు తెరపడనుంది. శనివారం(ఏప్రిల్ 9) ఉదయం 10.30 గంటలకు పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి. ఇటీవల ప్రధానితో పాటు స్పీకర్‌పై కూడా ప్రతిపక్షాలు అవిశ్వాత తీర్మానం పెట్టాయి. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ ఆ తీర్మానాన్ని అడ్డుకున్నారు. దీనిపై పాక్ సుప్రీం కోర్టును ప్రతిపక్షాలు ఆశ్రయించాయి. విచారణ జరిపిన న్యాయస్థానం అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. 42 స్ధానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెజార్టీకి 172 ఓట్లు అవసరం. అయితే ప్రతిపక్షాలు తమకు అంతకు మించి మద్దతు ఉందని చెబుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌కు మిత్ర పక్షాలు షాక్ ఇచ్చాయి. ఇక సొంత పార్టీ ఎంపీలు కూడా ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మాణానికి ముందే ఇమ్రాన్ రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ ఇమ్రాన్ రాజీనామా చేస్తే, కొత్త ప్రధానిగా విపక్షాలు బలపరుస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అమెరికాపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. అమెరికా కారణంగా పాక్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. అమెరికాకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.