ఏపీలో విద్యుత్ కోతలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో 11 గంటలు, పట్టణాలు, నగరాల్లో 8 గంటల వరకు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ విమర్శించారు. దీనికి వైసీపీ నుంచి కౌంటర్‌లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఇళ్లకు, వ్యవసాయానికి కరెంట్ కోతలు విధించడం లేదని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలపై ఆంక్షలు విధిస్తున్నామని, అందుకే పవర్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లోనే గ్రామాల్లో గంట, పట్టణాల్లో అర గంట పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్య ఏప్రిల్ చివరి వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ కొరత ఏపీలోనే కాదని, దేశవ్యాప్తంగా ఉందని చెప్పారు.