ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు విజయం సాధించింది. తాజా సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా, తొలి నాలుగు బంతుల్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం ఏర్పడ్డాయి. ఈ తరుణంలో రాహుల్ తివాతియా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి, గుజరాత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్(64), శిఖర్ ధావన్(35) రాణించారు. చివర్లో జితేష్ (23), రాహుల్ చాహర్(22*), అర్షదీప్ సింగ్(10*) మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు బౌలర్లలో రషీద్ 3, దర్శన్ నల్కండే 2 వికెట్లు తీయగా, షమీ, ఫెర్గ్యూసన్, హార్దిక్ పాండ్యకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ జట్టులో శుభమన్ గిల్ 96 పరుగులతో చెలరేగిపోయాడు. అతడికి సుదర్శన్(35), హార్దిక్ (27) సహకరించారు. చివర్లో తివాతియా (13*), డేవిడ్ మిల్లర్ (6*) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆఖరి బంతికి జట్టును గెలిపించారు.