తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్దరాత్రి దోపిడీకి పాల్పడ్డారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం దుండగులు సిగ్నల్ తీగలను కట్ చేశారు. సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ స్టేషన్‌కు శివార్లలో ఆపేశాడు. రైలు ఆగిన విషయం గమనించగానే దోపిడీ దొంగలు రైలులో ఎక్కారు. తమ వద్ద ఉన్న కత్తులు చూపించి ప్రయాణికులను బెదిరించారు. వారి వద్ద ఉన్న డబ్బు, బంగారం లూటీ చేశారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ ఆ రైలుకు సిగ్నల్ ఇవ్వడంతో, అది ముందుకు కదిలింది. కాగా దొంగలు ఎంత మొత్తం దోపిడీ చేశారో వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.