ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2022 పరీక్షకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి దీనిపై పలు వివరాలను వెల్లడించింది. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 11 నుంచి అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inలో, ఆన్‌లైన్ విధానంలో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు కూడా పాలిసెట్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులేనన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400లు నిర్ణయించారు. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పాలిసెట్ పరీక్షను మే 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.