తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు రూ.500లు జీతం పెంచడానికి కూడా కొందరు యజమానులు ఆలోచిస్తుంటారు. లాభాల కోసమే ఆలోచిస్తూ, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోరు. అయితే ఓ యజమాని మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. సంస్థ అభివృద్ధిలో భాగమైన 100 మంది ఉద్యోగులను ఎంపిక చేసి, వారికి కార్లను బహుమతిగా అందించాడు. చెన్నై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ‘ఐడియాస్2ఐటీ’ అనే ఇంజినీరింగ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థ అభివృద్ధికి విశేషంగా పాటుపడిన సీఈఓ గాయత్రి వివేకానందన్, సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మురళీ వివేకానందన్ తమ ఉద్యోగులకు కార్లు అందజేశారు. 2009లో తమ సంస్థను ప్రారంభించినప్పుడు కేవలం ఆరుగురు ఉద్యోగులు మాత్రమే ఉండేవారన్నారు. ప్రస్తుతం 500లకు పైగా సాఫ్ట్‌వేర్ నిపుణులు తమ సంస్థలో పని చేస్తున్నారని చెప్పారు. యూఎస్, మెక్సికో, భారత్‌లలో తమ సంస్థ సేవలందిస్తోందని, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ప్రముఖ కంపెనీలకు సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులను అందిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణమైన ఉద్యోగుల కృషిని గుర్తించి కార్లను బహుమతిగా అందించనట్లు తెలిపారు.