ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల దురాగతాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య పౌరులను చంపడం, మహిళలపై అత్యాచారాలు వంటి వాటిపై రష్యాను ప్రపంచ దేశాలు వేలెత్తి చూపుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో బాంబులు, మిస్సైళ్లతో పాటు అత్యాచారం కూడా రష్యా సైనికులు ఆయుధంగా ప్రయోగించారని ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం పేర్కొంది. దీనిపై ఉక్రెయిన్‌లోని లా స్ట్రాడా అనే సంస్థ హాట్‌లైన్‌కు అత్యాచార బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆ సంస్థ అధ్యక్షురాలు క్యాటరినా చెరిపాక ప్రపంచానికి వెల్లడించారు. రష్యా సైనికులు 9 రేప్ కేసుల్లో ఉన్నారని తెలిపారు. 12 మంది మహిళలు, అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. రష్యాపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.