తిరుమలలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భారీ రద్దీ ఏర్పడింది. రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని టీటీడీ నిలిపి వేసింది. దీంతో సర్వదర్శనం టికెట్ల కోసం ప్రజలు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. మంగళవారం మరలా సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లను టీటీడీ తెరిచింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ ప్రారంభించారు. అయితే భక్తులు భారీగా వచ్చిన విషయాన్ని టీటీడీ విస్మరించింది. అధికారులు తేరుకునేలోపే ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. చిన్నపిల్లలలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా రోజుల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నా తమకు సర్వదర్శనం టికెట్లు దొరకడం లేదని భక్తులు చెబుతున్నారు. వాటిని అధికారులు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో టీటీడీ స్పందించింది. నేరుగా భక్తులందరినీ తిరుమలకు పంపించేందుకు ఆదేశాలు జారీ చేశారు.