ఏ తల్లి అయినా తన బిడ్డలను కాపాడుకునేందుకు చూస్తోంది. నవమాసాలు మోసి, బిడ్డను కన్నాక వారి పెంపకమే తన బాధ్యతగా భావిస్తోంది. ప్రేమగా సాకి, పెంచి పెద్ద చేస్తోంది. అందుకే తల్లిని దేవతగా భావిస్తుంటారు. అయితే బిడ్డను సంరక్షించాల్సిన ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. పసికందును విచక్షణారహితంగా కొట్టింది. గుక్కపట్టి ఏడుస్తున్నా, ఆగకుండా చితకబాదింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రం సాంబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తన శిశువుతో మంచంపై కూర్చుంది. ఎవరితోనే వాదనకు దిగిన ఆమె తన ఒడిలో ఉన్న శిశువుపై ప్రతాపం చూపించింది. ఏడుస్తున్న పాపను అక్కున చేర్చుకుని బుజ్జగించాల్సింది పోయి, దారుణంగా కొట్టింది. ఈ హృదయ విదారక దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. నెటిజన్లు ఆ తల్లిపై ఘాటు విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. చిన్నారిని కొట్టిన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పాపపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.