పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసాను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా రూ.6 వేలను ప్రతి ఏడాది రైతులకు అందిస్తోంది. రూ.2 వేల చొప్పున విడతల వారీగా రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పథకంలో భాగంగా అనర్హులకు నిధులు వెళ్లాయని, వారి నుంచి పొందిన సాయం మొత్తం రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
పథకానికి ఎవరు అర్హులో జాబితాను రాష్ట్రాలకు పంపింది. దీని ప్రకారం సంస్థాగత భూమి కలవారు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వారు, మాజీలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు, మంత్రులు-మాజీ మంత్రుల కుటుంబాలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత-మాజీ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, ప్రస్తుత చైర్మన్లు, వారి కుటుంబాలు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారి స్థాయిలో ఉన్న వారు, రిటైర్మెంట్ తీసుకున్న వారు, రూ.10 వేల కంటే అధికంగా పెన్షన్ తీసుకుంటున్న వారు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, లాయర్లు వంటి వారు ఈ పథకంలో లబ్ధిదారులు కాదని కేంద్రం తెలిపింది.