అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ అనిరుద్ధుడు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని సినిమా థియేటర్లు, బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటరులలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించి అగ్నిప్రమాదాల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నివాసాలలో విద్యుత్ వైరింగ్ లో లూజ్ కాంటాక్టు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంట చేలల్లో చెత్తను తగలబెట్టే సమయంలో నీటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గృహాలలో వంట పనులు పూర్తయ్యాక గ్యాస్ రెగ్యులేటర్ను విధిగా నిలుపుదల చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ ప్రాంతాలలో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.