సాగు రుణ రికవరీలో మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మరే జిల్లా సహకార కేంద్రబ్యాంకు సాధించనివిధంగా చిత్తూరు డీసీసీబీ 92 శాతం ప్రగతిని సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు బ్యాంకు సీఈవో మనోహర్‌గౌడ్ శుక్రవారం తెలిపారు. సాగు రుణ రికవరీ రూ. 450 కోట్లకుగాను రూ. 415 కోట్ల వసూలు జరిగిందని చెప్పారు. రైతాంగ అభివృద్ధే లక్ష్యంగా రుణాలను అందించడంలోనూ, వసూళ్లలోనూ చిత్తూరు డీసీసీబీ పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. నాబార్డు రేటింగ్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం రూ. 2154 కోట్ల మేరకు వ్యాపారాభివృద్ధి చేసి సీ క్లాస్ నుంచి బీ క్లాస్‌కు చేరిందని వివరించారు.
తమ బ్యాంకుపై ఉన్న అపార నమ్మకంతో షేర్ క్యాపిటల్, డిపాజిట్లు పెరిగాయని చెప్పారు. రూ. 81 కోట్లకు షేర్ క్యాపిటల్, రూ. 798 కోట్లకు డిపాజిట్లు చేరాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి డిపాజిట్లను రూ. 950 కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నికర ఆదాయంలో కృష్ణా జిల్లా తర్వాత చిత్తూరు డీసీసీబీ ఆదాయపు పన్ను చెల్లింపు అనంతరం రూ. 10. 87 కోట్లకు చేరిందని చెప్పారు. ఈ ఏడాది నికర ఆదాయాన్ని రూ. 15కోట్లకు సాధించాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. ఎన్‌పీఏ శాతం గత ఏడాది 5. 82 ఉండగా 4. 35 శాతానికి తగ్గించగలిగామన్నారు.ఈ ఏడాది ఎన్‌పీఏను 3 శాతానికి తీసుకువచ్చే దిశగా ప్రయత్నిస్తున్నట్లు బ్యాంకు సీఈవో వివరించారు.