ఐపీఎల్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుత ఐపీఎల్-2022 సీజన్‌లో ఫించ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధికంగా 9 జట్లకు ప్రాతినిధ్యం వహించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తాజా సీజన్‌లో కోల్‌కతా తరుపున ఆడిన మ్యాచ్‌తో ఈ ఘనత అతడి సరసన చేరింది. గతంలో ఫించ్ రాజస్తాన్ రాయల్స్ (2010), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2011–2012), పుణే వారియర్స్ (2013), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2014), ముంబై ఇండియన్స్ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2018), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2020) జట్ల తరుపున ఆడాడు. ఇక ఈ జాబితాలో ఫించ్ తర్వాత స్థానంలో భారత ఆటగాళ్లే ఉన్నారు. దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్ ఇప్పటి వరకు 6 జట్లు తరుపున ఆడి రెండో స్థానంలో ఉన్నారు.