ఓ చిన్నారి తన ప్రతిభతో ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని మెప్పించింది. చిన్నారి అయిగిరి నందిని స్తోత్రాన్ని ఆలపించిన తీరు ప్రధాని నరేంద్ర మోదీని ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మోదీ నిన్న దేశరాజధాని హస్తినలో గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్లు, మెంబర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీని గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం కలిసింది. ఆ కుటుంబంలోని చిన్నారి మోదీ ఎదుట మహిషాసుర మర్దిని స్తోత్రం చదివి ఆయనను ముగ్ధుడ్ని చేసింది. తాను ప్రధాని ఎదురుగా ఉన్నానన్న తడబాటే లేకుండా, ఎంతో కష్టసాధ్యమైన ఆ స్తోత్రాన్ని తప్పుల్లేకుండా ఆలపించి ఔరా అనిపించింది. ఆ చిన్నారి పాడుతున్నంత సేపు ప్రధాని మోదీ ఓపిగ్గా విన్నారు. ఆపై వాహ్ అంటూ ఆమెను అభినందించారు.