ట్విట్టర్ కేవలం సమాచారం అందజేయడమే కాదు నేడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా చేతిలో ఆయుధంగా మారింది. దానిని కొందరు చెడుకు ఉపయోగిస్తే.. మరికొంతమంది మంచికి ఉపయోగిస్తున్నారు. కామెంట్లు, షేరింగ్‌లు, పోస్ట్‌లతో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకెళ్లి.. తమ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తోచినంత సాయం చేసి తోటివారిని ఆదుకుంటున్నారు. చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి తన కుటుంబం మొత్తం ఆధారపడే షాపును కోల్పోయాడు. అతని బాధను తెలుసుకున్న ఓ జర్నలిస్ట్ అతని కోసం ట్విట్టర్ ఆధారంగా విరాళాలు సేకరించాడు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందించారు.
ఇటీవల కరౌలీ ప్రాంతంలో జరిగిన హింసలో షకీర్ వహీద్ ఖాన్ (48) అనే వ్యక్తి తన షాపును కోల్పోయాడు. అతని బాధకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ ఆసిఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో షకీర్ వహిద్ ఖాన్ ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటున్నారు. తను ఇప్పుడు ఎలా బతకాలంటూ బాధపడ్డాడు. దీంతో వహీద్ ఖాన్‌కు విరాళాలు అందించి ఆయన్ని నిలబెట్టాలని ఆసీఫ్ నెటిజన్లను కోరారు. ఆసిఫ్ పిలుపుకు వెంటనే నెటిజన్లు స్పందించారు. తమకు తోచినంత సాయం చేశారు. దీంతో మొత్తం రూ.3 లక్షల రూపాయలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని ఆసిఫ్ వెల్లడిస్తూ మరో ట్వీట్ చేశారు. వహీద్ ఖాన్ కోసం విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తర్వాత ఆసిఫ్ మరో ట్వీట్ చేశారు. అందులో కరౌలిలో జరిగిన అల్లర్లలో 59 ముస్లిం సంస్థలు తమ వ్యాపారాలను కోల్పోయాయని, వారికి సంబంధించిన షాపులు అగ్నికి ఆహుతయ్యాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. చాలామంది ముస్లింల షాపులు ధ్వంసమయ్యాయి. తాము తీవ్రంగా నష్టాపోయామని ముస్లిం వ్యాపారులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాగా ఇటీవలె సోషల్ మీడియా సహకారంతో ఓ జొమాటో డెలివరీ బాయ్‌కు కొత్త బైక్ చేతికొచ్చింది. బైక్ లేకపోవడంతో మండుటెండలో సైకిల్‌పై డెలివరీలు అందిస్తున్న ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన నెటిజన్లు భారీ ఎత్తున విరాళాలు అందజేశారు.
రాజస్థాన్‌లో దుర్గా మీనా అనే వ్యక్తి జొమాటోలో పనిచేస్తూ ఆర్డర్లను సైకిల్‌పై తీసుకెళ్లి అందరికి ఇస్తున్నాడు. ఇది చూసి చలించిపోయిన ఆదిత్య శర్మ అనే వ్యక్తి మీనా పరిస్థితి గురించి తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అయింది. దుర్గా మీనా కష్టాన్ని తీర్చడానికి ఆదిత్యశర్మ విరాళాల సేకరణకు పూనుకున్నాడు. దానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. కొన్ని గంటల్లోనే 75 వేల రూపాయిలకు పైగా సమకూరాయి. దాంతో దుర్గా మీనాకు మంచి బైక్‌ను కొని అందజేశారు.