మొన్నటి శ్రీనామ నవమి సందర్భంగా చోటు చేసుకొన్న హింసను మరవకముందే హనుమాన్ జయంతి ఊరేగింపులోనూ హింస కొనసాగింది. ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో సాగుతున్న ర్యాలీలో హింస చెలరేగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో కొన్ని దగ్ధమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఘర్షణ తర్వాత జహంగీర్‌పురి ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
"పరిస్థితి అదుపులోనే ఉంది. సంబంధిత కమిటీలతో చర్చించడంతో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం. శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం" అని లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ దేవేంద్ర పాఠక్ చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా కూడా పరిస్థితి అదుపులో ఉందని, ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఆందోళనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
జహంగీర్‌పురి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మరోవైపు ర్యాలీపై రాళ్ల దాడిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే దేశ రాజధానిలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని కేజ్రీవాల్ అన్నారు. అలాగే ''శాంతి లేకుండా దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ రాజధానిలో శాంతిని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. శాంతి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలి." అని కేజ్రీవాల్ అన్నారు.