యువకుల్లో ప్రతిభ ఉందని సెలెక్టర్లు భావిస్తే వారికి అవకాశాలివ్వాలని యువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో భారత యువ క్రికెటర్లు విశేషంగా రాణిస్తుండడం పట్ల టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. శుభ్ మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్), అభిషేక్ శర్మ (సన్ రైజర్స్)లపై ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్ లో శుభ్ మాన్ గిల్ టీమిండియాకు నమ్మకమైన ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఎడమచేతి వాటం ఆటగాడు అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు చూస్తుంటే యువకుడిగా ఉన్నప్పుడు తన ఆటతీరు జ్ఞప్తికి వస్తోందని అన్నాడు. యువకుల్లో ప్రతిభ ఉందని సెలెక్టర్లు భావిస్తే వారికి అవకాశాలివ్వాలని యువీ స్పష్టం చేశాడు.
ఇటీవల కాలంలో శుభ్ మాన్ గిల్ టీమిండియాలోనూ కొన్ని మెరుగైన ఇన్నింగ్స్ లు ఆడడమే కాదు, ఐపీఎల్ లోనూ రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ గత సీజన్ లోనూ సన్ రైజర్స్ కు ఆడినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, ఈ సీజన్ లో మాత్రం తన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ధాటిగా ఆడుతూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. పాతికేళ్ల లోపు వయసు వాళ్లు కావడంతో... టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో సేవలు అందించే సత్తా ఉన్న ఆటగాళ్లుగా క్రికెట్ పండితులు ఈ ఇద్దరినీ అభివర్ణిస్తున్నారు.