కర్ణాటకలోని మంగళూరులో విషాద ఘటన జరిగింది. చేపల ప్రాసెసింగ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ విషవాయువులు లీక్ అయ్యాయి. అవి పీల్చడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు ట్యాంకులోకి దిగారు. అయితే చేపల వ్యర్థాలను తొలగించేందుకు వినియోగించే విష వాయువు అకస్మాత్తుగా లీక్ అయింది. దీంతో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.