దేశంలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. త్రిపుర రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ ఫారమ్‌లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగర్తలలోని నిపుణుల బృందం సోమవారం ఫారమ్‌కు చేరుకుంది. పరిస్థితిని అంచనా వేయడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ జంతువుల నుంచి తీసిన నమూనాలను ఈ నెల 7న పరీక్షల కోసం లేబొరేటరీకి పంపించారు. 13న వచ్చిన ఫలితాలలో అన్నీ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. ఫారమ్‌లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో ఫారమ్‌లోని అన్ని జంతువులకు వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ సోకిన జంతువులను చంపేయాలని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.