కళ్యాణదుర్గంలో తన ర్యాలీలో ఓ చిన్నారి మృతి పట్ల మంత్రి ఉషశ్రీచరణ్ స్పందిస్తూ.. చిన్నారిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభంజనానికి భయపడి శవరాజకీయం చేస్తున్న వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని.. వారిని ఆంజనేయస్వామే చూసుకుంటాడని వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్‌రెడ్డి అని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.తాడిపత్రికి వచ్చి తన మీద విమర్శలు చేయడం కాదని.. చనిపోయిన చిన్నారి తండ్రి వికలాంగుడు అని.. ఆయనకు పెన్షన్ ఇప్పించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కంటే తాను గట్టిగా విమర్శలు చేయగలనని హెచ్చరించారు. మహిళ కాబట్టే అన్ని విషయాలు చెప్పానని.. కర్ణాటక లోకయుక్తా , సుప్రీం కోర్టు కేసుల విషయం గురించి చెప్పమంటారా అని నిలదీశారు. చిన్నారి తండ్రికి ఫించన్ ఇప్పిస్తే మంత్రి ఇంటికి వెళ్లి తానే సన్మానం చేస్తానన్నారు. గతంలో ఏ పార్టీలో ఉన్నావో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మంత్రికి జేసీ ప్రభాకర్‌రెడ్డి హితవు పలికారు.