కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అందించబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచేందుకు మోదీ సర్కార్ రెడీ అవుతోంది. భారత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి ఈ రేటు వర్తిస్తోంది. సాధారణంగా డీఏ పెరిగిందంటే.. ఆటోమేటిక్‌గానే ఇతర అలవెన్స్‌లను కూడా పెంచుతారు. ఇప్పుడు కూడా ఇదే జరగబోతోంది. కానీ కేంద్రం హెచ్ఆర్ఏను చివరిగా ఏడాది కిందట పెంచింది. మళ్లీ ఇప్పుడు హెచ్ఆర్ఏ పెంచితే.. ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు వల్ల చాలా మందికి ఊరట కలుగుతుంది. హెచ్‌ఆర్ఏ రేట్లు ప్రస్తుతం 27 శాతం, 18 శాతం, 9 శాతంగా ఉన్నాయి. ఉద్యోగులు వారి కేటగిరి ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక హెచ్ఆర్ఏను పొందుతూ ఉంటారు. అయితే కేంద్రం ఈ రేట్లను పెంచాలని యోచిస్తోంది.
3 శాతం వరకు పెరిగే అవకాశం
హౌస్ రెంట్ అలవెన్స్ ఈసారి 3 శాతం మేర పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే ఎక్స్ కేటగిరిలోని వారికి పెంపు 3 శాతంగా ఉండొచ్చు. అలాగే వై కేటగిరిలోని వారికి హెచ్ఆర్ఏ పెంపు 2 శాతంగా ఉండే అవకాశముంది. ఇక జెడ్ కేటగిరిలోని ఉద్యోగులకు 1 శాతం మేర పైకి చేరొచ్చు. అంటే రేట్ల పెంపు తర్వాత హెచ్ఆర్ఏ 30 శాతంగా, 20 శాతంగా, 10 శాతంగా ఉండనున్నాయి. మినిమమ్ హెచ్ఆర్ఏ 10 శాతంగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అనేది వారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం ప్రాతిపదికన నిర్ణయం అవుతుంది. ఎక్స్, వై, జెడ్ అనేవి కేటగిరీలు. ఎక్స్ కేటగిరిలో ఉన్న ఉద్యోగులకు వారి బేసిక్ శాలరీలో 27 శాతం మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద అందిస్తారు. వై కేటగిరి అయితే 18 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక జెడ్ కేటగిరిలో ఉన్న వారికి 9 శాతం హెచ్‌ఆర్ఏ లభిస్తుంది. సిబ్బంది శిక్షణ విభాగం (డీఓపీటీ) ప్రకారం.. డియర్‌నెస్ అలవెన్స్ ప్రాతిపదికన హెచ్‌ఆర్ఏ కూడా మారుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వపు ఉద్యోగులు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.