అనకాపల్లి పట్టణంలోని తోటాడ కూడలి వద్ద లారీ ఢీకొనడంతో రైతు మృతి చెందాడు. సంతబయలువీధికి చెందిన కొణతాల గోవింద రామకృష్ణ (70) రోజూ మాదిరిగానే మంగళవారం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తున్నాడు. తోటాడ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో భార్య, చిన్న కుమారుడు చనిపోయారు.