శ్రీలంకలో పాలకుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను సైతం ముట్టడించి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. నైరుతి ప్రాంతంలోని రంబుక్కన పట్టణంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై ఆందోళనకారులు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. మంగళవారం పట్టణంలోని ఓ రైల్వే ట్రాక్‌ను వారంతా దిగ్భందించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ పట్టణంలో కర్ఫ్యూ విధించారు.
పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వారని, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే మొదట టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ప్రజాగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం దిగి వస్తోంది. కేబినెట్‌లో రాజపక్స కుటుంబికులు లేకుండా కొత్త కేబినెట్‌కు ప్రధాని మహింద రాజపక్స రూపకల్పన చేశారు. అయితే ఆ దేశంలో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.